ఇంద్రకీలాద్రిపై ఉత్సాహంగా ‘యోగాంధ్ర’
ఇంద్రకీలాద్రిపై ఉత్సాహంగా ‘యోగాంధ్ర’
సిబ్బందితో కలిసి యోగాసనాలు వేసిన చైర్మన్, ఈవో
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యం
ఉద్యోగులు, అర్చకులు, భక్తుల్లో పెరిగిన ఉత్సాహం
జూన్ 21 వరకు ప్రత్యేక యోగా శిక్షణ శిబిరాలు
ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఇంద్రకీలాద్రిపై ఉత్సాహంగా కొనసాగుతోంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 14 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక యోగా శిక్షణ శిబిరంలో బుధవారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ పాల్గొని సాధకులతో కలిసి యోగాసనాలు వేశారు. ఇంద్రకీలాద్రి మహామండపం ఆరో అంతస్తులో నిర్వహించిన ఈ శిబిరంలో చైర్మన్, ఈవో స్వయంగా వేదికపై యోగా సాధన చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రముఖ యోగా శిక్షకుడు గర్రె రాజేష్ ఆధ్వర్యంలో శారీరక దృఢత్వాన్ని పెంపొందించే ఆసనాలు, ఏకాగ్రతను పెంచే ధ్యాన విధానాలపై పాల్గొనేవారికి ప్రత్యేక శిక్షణ అందించారు. దేవస్థాన యంత్రాంగం స్వయంగా ముందుండి యోగా సాధన చేయడంతో నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే ఆలయ ఉద్యోగులు, అర్చకులు, భద్రతా సిబ్బందిలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై యోగా శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం ద్వారా భక్తులతో పాటు ఒత్తిడితో కూడిన విధులు నిర్వహించే దేవాలయ సిబ్బందిలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమన్నారు.

యోగా ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయవచ్చని పేర్కొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు కొనసాగనున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శిక్షణకు హాజరైన భక్తుల వివరాలను ఐటీ విభాగం నమోదు చేయగా, కార్యక్రమం అనంతరం దేవస్థానం తరఫున అందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, దేవస్థాన సిబ్బంది, అర్చకులు, భద్రతా సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
