ఈ నెల 24న సివిల్స్ ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ఈ నెల 24న సివిల్స్ ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
-10,119 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు 23 కేంద్రాలు
-అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలి
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈ నెల 24న దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని.. అయినా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. యూపీఎస్సీ ఇన్‌స్పెక్టింగ్ అధికారులు హర్వేష్ కుమార్, సునీల్ కుమార్‌తో కలిసి కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మక సివిల్స్ ప్రిలిమ్స్‌ను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశనం చేశారు. విజయవాడలో 23 ఉప కేంద్రాల్లో 10,119 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశామని.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు పరీక్ష రాసేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ నెల 24న ఆదివారం ఉదయం 9.30 గం. నుంచి 11.30 గం. వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గం. నుంచి 4.30 గం. వరకు పేపర్-2కు పరీక్ష జరగనుందన్నారు. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే కేంద్రం లోపలకు రావాల్సి ఉంటుందని.. అందువల్ల అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.
మొబైల్ ఫోన్లు, ఐటీ గాడ్జెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి లైజన్ ఆఫీసర్ కమ్ లోకల్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్స్, వెన్యూ సూపర్‌వైజర్లు, ఇన్విజిలేటర్లు తదితరులను నియమించినట్లు వెల్లడించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్యుత్, ఏపీఎస్ఆర్‌టీసీ, మునిసిపల్, పోస్టల్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేయాలన్నారు.
వేసవి నేపథ్యంలో తాగునీరుతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, సమన్వయ శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
