యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి

యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా సాధన అవసరం

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం–2026 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమంలో భాగంగా బుధవారం కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా అధికారులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు పాల్గొని యోగా సాధన చేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో యోగాంధ్ర–2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. జూన్ 7న లేపాక్షిలో యోగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా, ప్రస్తుతం గ్రామస్థాయిలో విస్తృతంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జిల్లాలో యోగా గురువులను గుర్తించి, వారి ద్వారా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ అందించామని తెలిపారు. అనంతరం ప్రతి సచివాలయానికి యోగా శిక్షకులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామని వివరించారు. త్వరలో గ్రామస్థాయిలో యోగా శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా పోటీలు, యోగా క్విజ్‌లు, ప్రాణాయామం, వ్యక్తిగత యోగా ప్రదర్శనలు తదితర కార్యక్రమాలను గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలందరూ యోగాను రెండు మూడు వారాల కార్యక్రమంగా కాకుండా, జీవితాంతం అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన కదిరితో పాటు ఆరోగ్యవంతమైన జిల్లాను నిర్మించాలంటే ప్రతి ఒక్కరూ యోగా సాధనను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ సందీప్, ఆర్డీఓ కలావతి, తహసీల్దార్ రెడ్డి శేఖర్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.