వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం

వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం

భారీగా తరలివచ్చిన భక్తజనం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని బూదగవిలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి రథోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. భక్తి ప్రపత్తులతో వేలాది మంది భక్తుల జై శ్రీరామ్ జై శ్రీరామ్ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగాయి. శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవ ఉత్సవాల్లో భాగంగా సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున స్వామి వారి మూల విరాట్ కు రుద్రాభిషేకం, అభిషేకం, అర్చనలు, రథంగా హోమాలు, రథోత్సవం శాంతి పూజ, గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, బలిదానం, పూర్ణ హారతి, మహా మంగళ హారతి కార్యక్రమాలను నిర్వహించారు.

స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, భాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఊరేగించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథోత్సవంలో కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో మడుగు తేరును కొద్ది దూరం వరకు లాగారు. సాయంత్రం రథోత్సవాన్ని భక్తులు లాగారు. స్వామి వారిని దర్శించుకోవడానికి, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం తో పోటెత్తారు.

స్వామివారిని భక్తులు దర్శించుకుని, తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఎస్సై జనార్దన్ నాయుడు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గురు, గ్రామ మాజీ సర్పంచ్ చత్ర గుడి చిరంజీవి, హను మంత రాయుడు, చత్ర గుడి సుధాకర్, వీరప్ప గౌడ్, నగేష్ గౌడ్, ఉమేష్, ఎర్రి స్వామి, నాగేంద్ర, చక్రి, గాది లింగప్ప తదితరులు పాల్గొన్నారు.