Yadadri Cyber Fraud | నకిలీ వెబ్‌సైట్లతో భక్తుల టార్గెట్

టికెట్లు, సేవల పేరుతో వసూళ్లు
అధికారిక వెబ్‌సైట్‌నే వినియోగించండి
నకిలీ పోర్టళ్లపై చర్యలు కోరుతున్న భక్తులు

Yadadri Cyber Fraud | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు రూపొందించి భక్తులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, హోమాలు, వసతి బుకింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయక భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన ఫొటోలు, యాదాద్రి పేరును ఉపయోగిస్తూ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ పోర్టళ్లను సృష్టించి భక్తులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని వెబ్‌సైట్లలో యాదాద్రి సుదర్శన హోమం వంటి సేవల వివరాలను కూడా ప్రదర్శిస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.

ఈ నకిలీ లింకులను సోషల్ మీడియా, వాట్సాప్ తదితర వేదికల ద్వారా ప్రచారం చేస్తూ, క్యూఆర్ కోడ్‌లు లేదా వ్యక్తిగత గూగుల్ పే, ఫోన్‌పే, బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలాంటి చెల్లింపుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భక్తులు దేవస్థాన అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దేవస్థానానికి సంబంధం లేని వెబ్‌సైట్లు, యాప్‌లు లేదా వ్యక్తిగత ఖాతాలకు ఎలాంటి చెల్లింపులు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

నకిలీ వెబ్‌సైట్లపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తులను అప్రమత్తం చేసేలా యాదాద్రి దేవస్థానం అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఒకవేళ ఇలాంటి సైబర్ మోసాలకు గురైనా లేదా అనుమానాస్పద వెబ్‌సైట్లు కనిపించినా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.