చదువులతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి:

ఎంఈఓ సైదానాయక్

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ :హుజూర్‌నగర్ పట్టణంలోని ఎండీఆర్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు క్యాబినెట్ ఎన్నికల నిర్వహణ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి సైదానాయక్ హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువులతో పాటు నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత భావన, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా పాఠశాల యాజమాన్యం క్యాబినెట్ ఎన్నికలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

విద్యార్థులు తమకు నచ్చిన అభ్యర్థిని ప్రజాస్వామ్య పద్ధతిలో క్లాస్ లీడర్‌గా ఎన్నుకోవాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎండీఆర్ విద్యాసంస్థల చైర్మన్ మేరెడ్డి దామోదర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు, ఏవో పింగళి నర్సిరెడ్డి, సీఆర్పీలు సైదులు, బ్రహ్మం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.