స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో పరిశుభ్ర సమాజ నిర్మాణమే లక్ష్యం

  • జిల్లా జాయింట్ కలెక్టర్ డా.యం.జె.అభిషేక్ గౌడ

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాన్ని “బల్క్ వేస్ట్ జనరేటర్స్ నమోదు, ఘనవ్యర్థాల నిర్వహణ నియమాలు మరియు పరిశుభ్రతపై అవగాహన” అనే అంశంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జే. అభిషేక్ గౌడ, అనంతరం అందరితో కలిసి స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం.జే. అభిషేక్ గౌడ మాట్లాడుతూ, ప్రతి మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజలు భాగస్వామ్యమై పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడంతో పాటు, వ్యర్థాల నిర్వహణ ద్వారా సంపద సృష్టించేందుకు ముందుకు రావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అనేక వ్యాధులను నివారించవచ్చని, పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించి, పరిశుభ్రతను జీవన విధానంగా అలవర్చుకునేలా చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు.

వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం, ఈ-వ్యర్థాల సేకరణ, సురక్షిత రీసైక్లింగ్ విధానాలపై అవగాహన కల్పించడం, అలాగే చెత్తను తడి, పొడి, హానికర వ్యర్థాలుగా వేరు చేసే విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, చెట్ల సంరక్షణ, ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీదేవి, జిల్లా కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వి. నాంచారయ్య, సూపరింటెండెంట్లు, రెవెన్యూ శాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.