తెలంగాణ క్రీడా అకాడమీల్లో ఉచిత ప్రవేశాలకు ఎంపికలు..

జూలై 20 నుంచి ట్రయల్స్

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ క్రీడా అకాడమీలు, రీజినల్ స్పోర్ట్స్ హాస్టళ్లలో ఉచిత ప్రవేశాల కోసం ఈ నెల 20 నుంచి 28 వరకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు భూపాలపల్లి జిల్లా యువజన, క్రీడల అధికారి చిర్ర రఘు తెలిపారు. అర్హులైన ప్రతిభావంతులైన బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

హైదరాబాద్, ఖమ్మం, సిద్ధిపేట, మహబూబ్‌నగర్, హన్మకొండ తదితర కేంద్రాల్లో సైక్లింగ్, రెజ్లింగ్, వాలీబాల్, అథ్లెటిక్స్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ తదితర క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆయా అకాడమీల నిబంధనల ప్రకారం 10–12, 14–16, 16–18 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారులు ట్రయల్స్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు.

ఎంపికలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రస్తుత పాఠశాల లేదా కళాశాల నుంచి వయస్సు, స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో, ఆధార్ కార్డు లేదా నివాస ధృవీకరణ పత్రం, 10 తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.

ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచిన వారికి తెలంగాణ క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ హాస్టళ్లలో ఉచిత శిక్షణ, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తెలిపారు. ఎంపికల తేదీలు, వేదికలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాల కోసం జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.