107 million | హర్మూజ్ దాటిన నౌక

107 million | హర్మూజ్ దాటిన నౌక
గుజరాత్ చేరిన ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్
13న హర్మూజ్ దాటిన నౌక
జలసంధి దాటిన 11వ ఎల్పీజీ ట్యాంకర్
107 million | న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎల్పీజీ లోడ్‌తో ఉన్న ‘సైమీ’ ట్యాంకర్ సురక్షితంగా గుజరాత్‌లోని కండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక దాదాపు 20 వేల టన్నుల ఇంధనాన్ని తీసుకొచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం మధ్య మే 13వ తేదీన ఈ నౌక హర్మూజ్ జలసంధిని దాటింది. దీంట్లో మొత్తం 21 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఎనిమిది మంది ఉక్రేనియన్లు, 13 మంది ఫిలిప్పీన్స్ పౌరులు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో హర్మూజ్‌ను విజయవంతంగా దాటిన 11వ ఎల్పీజీ ట్యాంకర్ ‘సైమీ’. షిప్పింగ్, విదేశాంగ, రక్షణ, చమురు శాఖల సమన్వయంతో ‘సైమీ’ భారత్‌కు చేరుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. హర్మూజ్ జలసంధిలో 75 రోజులుగా అంతరాయాల కారణంగా భారత్ ముడిచమురు నిల్వలు గణనీయంగా తగ్గాయి.
107 million | 15 శాతం పడిపోయిన చమురు నిల్వలు..
గడిచిన కొన్ని నెలల్లోనే భారతదేశ చమురు నిల్వలు దాదాపు 15 శాతం మేర పడిపోయాయి. ఫిబ్రవరి చివరలో ఈ సంక్షోభం ప్రారంభమైనప్పుడు చమురు నిల్వలు 107 మిలియన్ బారెల్స్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నిల్వలు 91 మిలియన్ బారెల్స్‌కు పడిపోయాయని ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్ తెలిపింది. దిగుమతులు తగ్గినప్పటికీ భారతీయ రిఫైనరీలు తమ కార్యకలాపాలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ప్రాసెసింగ్ పనుల్లో ఇప్పటివరకు ఎలాంటి కోతలు విధించకుండా స్థిరంగా సాగిస్తున్నాయి. అయితే సరఫరాలో అంతరాయాలు కొనసాగితే రిఫైనరీల నిర్వహణ భారంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ముడిచమురు ప్రాసెసింగ్ స్థాయులను తగ్గించుకోవడం మినహా వేరే మార్గం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.
CLICK HERE TO READ MORE : who I Global Emergency I 1976 I ఆంక్షలు వద్దు.. అప్రమత్తంగా ఉండాలి!
