శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉమామహేశ్వర దేవస్థానం బృందం

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీశైలం గిరిప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యుడు కట్ట సుధాకర్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేయించి, స్వామివారికి అభిషేకం నిర్వహించడంతో పాటు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు.

శ్రీశైలం దేవస్థానం అధికారులు, అర్చకులు శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం నుంచి వచ్చిన ఛైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు తదితరులకు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు మాట్లాడుతూ, శ్రీశైలానికి ఉత్తరద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం నుంచి తొలిసారిగా గిరిప్రదక్షిణ చేపట్టడం విశిష్టమైన సంకల్పమని పేర్కొన్నారు.

శ్రీశైలం నాలుగు ద్వారాల గిరిప్రదక్షిణ విజయవంతంగా పూర్తికావాలని ఆశీర్వదిస్తూ, శ్రీ భ్రమరాంబికా అమ్మవారు, శ్రీ మల్లికార్జున స్వామివారి దివ్యానుగ్రహం యాత్రికులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఛైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు, దేవస్థానం పాలక మండలి సభ్యులు, అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.