ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన అధికారులు..
- అక్రమ మట్టి రవాణా నిలిపివేత
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : కన్నాయిగూడెం మండలంలో అక్రమ మట్టి రవాణాపై ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు జీపీఓలను ఘటనాస్థలికి పంపించి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు గుర్తించి, అక్కడే మట్టి రవాణాను వెంటనే నిలిపివేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై ఎలాంటి రాజీ ఉండదని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా వెంటనే స్పందించి చర్యలు చేపడతామని తెలిపారు. దీంతో స్థానికులు అధికారుల తక్షణ స్పందనను అభినందిస్తూ, ఇలాంటి అక్రమాలపై నిరంతర నిఘా కొనసాగించాలని కోరుతున్నారు.
