పేరుకుపోతున్న చెత్తకు పరిష్కారం ఏది……?
ప్రైజర్ పేట మెయిన్ రోడ్ మీద పబ్లిక్ ట్యాప్ చుట్టూ చెత్తాచెదారం
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో శానిటరీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొన్ని చోట్ల చెత్తాచెదారం పేరుకుపోతుంది. విజయవాడ 49 వ డివిజన్ ప్రైజర్ పేట మురికిపూడి వారి వీధి మొదట్లో అది మెయిన్ రోడ్ మీద ఉన్న పబ్లిక్ ట్యాప్ చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయింది అంటే పరిస్థితి ఎలాగో ఉందో అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ ట్యాప్ చుట్టూ ఇలా చెత్తాచెదారం పేరుకుపోతే నీళ్ళు పట్టుకొనేది ఎలా అని స్థానికులు అంటున్నారు.

ప్రైజర్ పేట మెయిన్ రోడ్ లోనే చెత్తాచెదారం ఇలా ఉంటే ఇక కొండ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం గురించి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి అని స్థానికులు అంటున్నారు. ఎన్నికల విధులు అంటూ శానిటరీ అధికారులు రావడం లేదు, దాంతో క్రింద స్థాయి సిబ్బంది అక్కడోక చీపిరి ఇక్కడోక చీపిరి అన్న విధంగా పని చేస్తున్నారు. ఇంకా నాలుగు రోజుల పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్నికల విధుల్లో ఉంటారని సిబ్బంది చెబుతున్నారు అని స్థానికులు అంటున్నారు.
అలాగే 56 వ డివిజన్ పరిధిలోని కర్మెల్ చర్చి వీధి చివర రైల్వే అప్ యార్డ్ కు వెళ్ళి దారి లో వాడి పాడైన పరుపులు, పాడై పోయిన కేన్ కుర్చీలు, దిండ్లు ఇలా ఒకటేమిటి అన్ని రకాల చెత్తాచెదారం పేరుకుపోయింది. నిండిన డంపర్ బిన్ లో ఉన్న చెత్తాచెదారం ను సైతం తొలగించలేదు. శానిటరీ సిబ్బంది సరిగ్గా రావడం లేదని స్థానికులు అంటున్నారు. ప్రతి రోజూ శానిటరీ సిబ్బంది విధుల్లో పాల్గొనేట్లు చూడాలని స్థానికులు కోరుతున్నారు.
