ధరల పెరుగుదలపై సీపీఐ ఆందోళన..
ధరల పెరుగుదలపై సీపీఐ ఆందోళన..
- వరంగల్ కలెక్టరేట్ ముట్టడి
వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం వరంగల్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ వరంగల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.
మొదట ఏకశిలా పార్కు నుంచి ప్రదర్శనగా బయలుదేరిన సీపీఐ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారాన్ని మోపుతోందని విమర్శించారు. వెంటనే ధరలను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయని సాకుగా చూపుతూ నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
వంట గ్యాస్‌తో పాటు కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో చిన్న వ్యాపారులు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వం స్పందించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్‌మియా, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు దండు లక్ష్మణ్, పనాస ప్రసాద్, జిల్లా నాయకులు గన్నారపు రమేష్, బుస్సా రవీందర్, గుండె బద్రి, సంగి ఎలేందర్, అక్కపెల్లి రమేష్, కందిక చెన్నకేశవులు, వీరగోని శంకరయ్య, పార్థసారథి, దామెర కృష్ణ, ఆరెళ్లి రవి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ల్యాదెళ్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.
