ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ

ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ

ధర్మసాగర్, ఆంధ్రప్రభ : మండుటెండల్లో ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమై ఉన్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముప్పారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక తెలిపారు. సోమవారం గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించిన సర్పంచ్ రేణుక సుమారు 100 మంది కూలీలకు చల్లటి మజ్జిగతో పాటు అరటి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులకు కూడా మజ్జిగ, అరటి పండ్లు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక మాట్లాడుతూ వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మండుటెండల్లో పనిచేస్తున్న కూలీలకు ఉపశమనం కలిగించేలా మే నెలాఖరు వరకు ప్రతిరోజూ చల్లటి మజ్జిగ పంపిణీ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, గ్రామ కార్యదర్శి ఆకారపు సురేష్, వార్డు సభ్యులు సునీత బాలస్వామి, ముంజ కృష్ణవేణి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.