అమరావతిపై ఎందుకింత ద్వేషం? జగన్ వైఖరిపై విమర్శలు

అమరావతిపై ఎందుకింత ద్వేషం? జగన్ వైఖరిపై విమర్శలు

అమరావతి విషయంలో జగన్ మాట మార్పులపై విమర్శలు

మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రానికి నష్టం జరిగిందన్న వాదన

అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం, వైసీపీపై రాజకీయ విమర్శలు

మాట తప్పను.. మడమ తిప్పను అంటూ డైలాగులు చెప్పే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని విషయంలో మాట తప్పడం, మడమ తిప్పడంలో పేటెంట్ హక్కులు పొందారు. 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతికి జై కొట్టిన జగన్ 2019లో అధికారంలోకి రాగానే దోచుకునే అవసరం కోసం మాట మార్చేశారు. మూడురాజధానులంటూ కొత్త నాటకానికి తెరతీశారు. 2024లో ప్రజలు వైసీపీని తిరస్కరించిన తర్వాత “మావిగన్” అంటూ మళ్ళీ తెరమీదకు వచ్చారు. మావిగన్ అంటే జగన్ భాషలో చెప్పాలంటే మాటతప్పడం.. విద్వేషాలు.. గన్ సంస్కృతి. అందుకే ఆయన మావిగన్ రాగాన్ని ఆలపిస్తున్నారు.

జగన్ లక్ష్యం రాజధాని నిర్మించటం కాదు. రాజధాని పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమని ప్రజలకూ బాగా అర్థమైంది. కాని మాజీ ముఖ్యమంత్రికి మాత్రం జ్ఞానోదయం కలగడం లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐదేళ్ళ వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన అమరావతికి కూటమి ప్రభుత్వ పాలనలో మళ్ళీ వెలుగులు వచ్చాయి.

ఇది సహించలేని జగన్ విద్వేషం కనపరుస్తూనే ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్ళు అమరావతిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా కుట్రలు చేసిన జగన్ ఇప్పటికీ రాజధానిపై విషం కక్కడం మానలేదు. అవాకులు చవాకులతో మరోసారి రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందేమో? అమరావతిపై నాలుక మడతేయడం, మాటమార్చేయడం జగనకు వెన్నతో పెట్టిన విద్య. గుంటూరు-విజయవాడ మధ్య 35 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని, రాజధానిగా అమరావతి తమకు ఆమోదయోగ్యమేనని ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ 2019 వరకు అదేపాట పాడారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని 2019 ఎన్నికల సభ సమయంలోనూ జగన్, వైకాపా నాయకులు ఢంకాభజాయించి చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఎక్కడ ఉంటే అదే రాజధాని అని జగన్ ఒక సభలో చెప్పారు. 2019లో ఓట్ల కోసం నటించిన జగన్ గెలిచాక అసలు రూపం బయటపెట్టారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని సర్వనాశనం చేసేందుకు నడుం కట్టారు. 2024 ఎన్నికల్లో తలబొప్పి కట్టడంతో వైకాపా మళ్ళీ అధికారంలోకి వస్తే సీఎంగా జగన్ అమరావతిలోనే ఉంటారని విశాఖ వెళ్ళరని ఆ పార్టీ నాయకులు చెప్పారు. వైకాపా నాయకుల నిజస్వరూపం ఏంటో, అమరావతిపై వారి వైఖరేంటో జగన్ చేస్తున్న వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. అమరావతిపై జగన్ తరుచుగా మాటలు మార్చడాన్ని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది.

ప్రమాదకర రాజకీయ క్రీడ!

అమరావతి నిర్మాణం వేగం అందుకున్న శుభతరుణంలో వాస్తవాలను వక్రీకరిస్తూ, స్వార్థబుద్ధితో, సంకుచిత వాదనలతో ప్రమాదకర రాజకీయ క్రీడను ఆరంభించారు జగన్ రెడ్డి. ఆయన పసలేని, పనికిమాలిన రాజకీయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మొదటి నుంచీ అమరావతికి పురిట్లోనే సంధి కొట్టాలని జగన్ రెడ్డి సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. అమరావతిని పడగొట్టడం, విడగొట్టడం, చెడగొట్టడమే లక్ష్యంగా గోముఖ వ్యాఘ్ర విన్యాసాన్ని జగన్ ప్రదర్శించారు.

అమరావతిలో అద్భుత రాజధానిని నిర్మిస్తామన్న హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అమరావతికి మరణ శాసనం రాశారు. మూడు రాజధానుల నాటకం ఆడి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారు. నాలుకను అడ్డదిడ్డంగా మడతేయడంలో జగన్ రెడ్డి ఊసరవెల్లికి సాటి రాగలరు. అనాగరిక, విద్వేష రాజకీయాలతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఎగదోసి కండ కావరంతో రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారు. అందుకే జగన్రెడ్డిని 2024 ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. ప్రతిపక్ష హోదా సైతం దక్కనంతగా తిరస్కరించారు. అయినా ఆయన బుద్ధి మార్చుకోవడం లేదు. అమరావతిపై వికృత వ్యాఖ్యలు చేస్తూ సైంధవుడిలా ఇంకా అడ్డుకోవాలని చూస్తున్నారు.

రాజధానిగా అమరావతి అభివృద్ధి కాకూడదన్నదే జగన్ రెడ్డి ఉద్దేశ్యంగా అర్థమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి పెట్టుబడులు, లేదా గ్రాంట్లు రాకూడదు అన్నదే ఆయన వ్యవహారం.

నాటి తెలుగుదేశం ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా రైతులను మెప్పించి, ఒప్పించి ముప్పయ్ వేల ఎకరాల పైచిలుకు భూములను సమీకరించి రాజధాని నిర్మాణం ప్రారంభించింది. ఫ్లడ్ లైట్ల వెలుగులో వేలమంది కార్మికులతో రాజధాని నిర్మాణ పనులు జరిగాయి. అడ్డు పడకుండా అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈపాటికి అమరావతి నిర్మాణం పూర్తయి ఉండేది. నేటికి ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒక ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేది. కానీ 2019లో విధి వక్రించి రాష్ట్రంలో తుగ్లక్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ శాసనసభలో తీర్మానం చేసినప్పుడు ఆమోదం తెలిపిన తుగ్లక్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత మాట మార్చి, మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటకు తెర తీశారు. ఆ వెంటనే ఆయన ముష్కర మూక కూడా అమరావతిపై విషపూరిత ప్రకటనలు చేయడం ఆరంభించింది. వాళ్ళు అమరావతిని ఎడారిగా, శ్మశానంగా అభివర్ణించారు. సొంత మీడియా సహకారంతో అమరావతిని భ్రమరావతిగా, కమ్మరావతిగా చిత్రించారు. రాజధాని భూముల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని ప్రచారం చేశారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్నిస్థాయిల్లో ఈ కేసులను కొట్టివేశారు. అంతేగాక అమరావతిలో కుంభకోణం, లంబకోణం ఏదీ జరగలేదని విస్పష్ట తీర్పు వెలువడింది. అయినప్పటికీ జగన్ ముష్కర మూక విష ప్రచారం ఆపలేదు. చంద్రబాబు ప్రారంభించిన రాజధాని కావడంతో వ్యక్తిగత ద్వేషం, రాజకీయ అహంకారం, ప్రతీకార భావజాలం ఈ మూడింటి మేళవింపుతో అమరావతిపై విషం కక్కారు. ప్రపంచంలో ఎక్కడా లేని మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తెచ్చేసరికి పెట్టుబడులు పారిపోయాయి, ఉద్యోగాలు ఆగిపోయాయి, రైతులు రోడ్డెక్కారు. రైతులపై వ్యవస్థాగత దాడి మొదలైంది. రోడ్లు, భవనాలు, కార్యాలయాల ధ్వంసం, కేసులు, అరెస్టులు, అణచివేత, అమరావతిపై జగన్ కక్కిన విషం ఏపీ విశ్వసనీయతను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ఏదిఏమైనా అమరావతి అంతమే జగన్ పంతం అని అర్థమవుతున్నది. అందుకే జగన్ కుట్రల నుంచి అమరావతిని రక్షించుకోవాలి.