నూతన బైపాస్ రోడ్డును ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

రూ.1.40 కోట్లతో నిర్మాణం.. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న మంత్రి

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బైపాస్ రోడ్డును ఆదివారం కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో సుదీర్ఘకాలంగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు ఈ బైపాస్ రోడ్డుతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపడుతోందని పేర్కొన్నారు.

రోడ్డు నిర్మాణ పనులు కేవలం మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించారని ప్రతిపక్షాలు ఆరోపించాయని, అయితే మాటల్లో కాకుండా పనులు పూర్తి చేసి చూపించామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

చెన్నూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్ తివారీ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.