పశ్చిమగోదావరిలో మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ..
పశ్చిమగోదావరిలో మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ..
ఆరేళ్లుగా ఎదురుచూపుల్లో నాలుగు మున్సిపాలిటీలు
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పట్టణాల అభివృద్ధి, పరిపాలనలో కీలకమైన మున్సిపల్ పాలకవర్గాలు పశ్చిమగోదావరి జిల్లాలో ఆరేళ్లుగా లేకపోవడంతో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాలిటీలు ఎన్నికల కోసం ఎదురుచూపుల్లో ఉన్నాయి.
జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు ఉండగా, నరసాపురం మున్సిపాలిటీకి మాత్రమే 2021లో ఎన్నికలు జరిగాయి. అయితే ఆ పాలకవర్గ పదవీకాలం ఈ ఏడాది మార్చి 16తో ముగిసింది. మిగిలిన నాలుగు మున్సిపాలిటీలకు 2019లోనే పదవీకాలం ముగిసినప్పటికీ, విలీన గ్రామాల వివాదాలు, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు.
భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాలిటీల పరిధిలో గ్రామాల విలీనం ప్రతిపాదనలు గతంలో తీసుకురాగా, కొన్ని గ్రామాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతరం కోర్టు కేసుల కారణంగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో నాలుగు మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారులు పాలన కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా ఈ మున్సిపాలిటీల్లో ముందుకు సాగకపోవడంతో ఎన్నికలపై స్పష్టత లేకుండా ఉంది. నరసాపురం, ఆకివీడు వంటి ప్రాంతాల్లో వార్డుల పెంపు జరిగినప్పటికీ, భీమవరం (39), పాలకొల్లు (31), తాడేపల్లిగూడెం (35), తణుకు (34) వార్డుల్లో ఎటువంటి మార్పులు జరగలేదు.
మున్సిపల్ శాఖ మంత్రి గతంలో ఎన్నికల నిర్వహణపై హామీ ఇచ్చినప్పటికీ, విలీన గ్రామాల సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో స్థానిక ప్రజలు, రాజకీయ ఆశావహులు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని ఎదురుచూస్తున్నారు.
