Mrigasira Karte | ప‌ల్లెలు పంట సిరుల‌తో వ‌ర్థిల్లాలి

Mrigasira Karte | ప‌ల్లెలు పంట సిరుల‌తో వ‌ర్థిల్లాలి

రైతుల‌కు సీఎం మృగశిర కార్తె శుభాకాంక్షలు

Mrigasira Karte | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: వానాకాలం వ్యవసాయానికి శ్రీకారం చుట్టే మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తొలకరి పలకరింపు రైతులు, రైతు కూలీల ఇళ్లలో ఆనందోత్సాహాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మృగశిర కార్తె అన్నదాతలకు శుభారంభం కావాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పుష్కలమైన పంటలు పండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు వాతావరణ శాఖతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలపై ముందస్తు అంచనాలను దృష్టిలో పెట్టుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులను కోరారు.

కొన్ని పరిమిత పంటల సాగుపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల పప్పుధాన్యాలు, వేరుశనగ, పెసలు, మినుములు, నువ్వులు వంటి పంటలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు రైతులు పంటల వైవిధ్యంపై దృష్టి సారించాలని సూచించారు.

వరుసగా ఒకే పంటను సాగు చేయడం వల్ల నేల సారం తగ్గడంతో పాటు తెగుళ్ల సమస్యలు పెరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంట మార్పిడి పాటిస్తే నేల సారం మెరుగుపడటమే కాకుండా, దీర్ఘకాలంలో అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.