యోగాతో ఆరోగ్యమే కాదు.. ఆత్మవిశ్వాసం కూడా
యోగాతో ఆరోగ్యమే కాదు.. ఆత్మవిశ్వాసం కూడా
యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి: కలెక్టర్ వెట్రి సెల్వి
ఏలూరు, ఆంధ్రప్రభ : యోగ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి తెలిపారు. స్థానిక వట్లూరులోని టీటీడీసీలో బుధవారం నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ, యోగ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో విడదీయరాని భాగంగా చేసుకోవాలని సూచించారు.

జూన్ 21 వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 200 మందికి పైగా మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, వారి ద్వారా ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రజలకు యోగాపై అవగాహన కల్పిస్తూ శిక్షణ అందిస్తున్నామని వివరించారు.

జిల్లాలోని పలు ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 11న ద్వారకాతిరుమలలో, జూన్ 19న పోలవరం మండలం పట్టిసీమలో భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న ఏలూరు నగరంలో వెయ్యి మందికి పైగా ప్రజలతో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన యోగా సాధనను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలికి యోగా ఉత్తమ మార్గమని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, డీపీఓ మల్లికార్జునరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
