ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించాలి…

ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించాలి…

పేదలకు ఉపాధి కల్పించాలి…
షేస్ యాప్ రద్దు చేయాలి…సిపిఎం డిమాండ్.

ఏలూరుబ్యూరో , ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించాలని, పేదలకు ఉపాధి కల్పించాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు నేడొక ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు ఉపాధి హామీకి నిధులు తగ్గించి పేదల పొట్టకొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రతి ఏటా గ్రామీణ శ్రామికులకు ఉపాధిహామీ పనులు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ.9,346 కోట్లు నుండి రూ.10,648 కోట్లు కేటాయించేవని, కాని ఈ ఏడాది కార్మికుల వేతనాల కోసం కేవలం రూ.738 కోట్లకే పరిమితం చేయడం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడమేనని అన్నారు.

వ్యవసాయ పనులు లేని సమయంలో సన్న, చిన్న రైతులు కూడా ఉపాధి పనులు చేసుకొని జీవిస్తున్నారని, అటువంటిది ఈ ఏడాది ఏకంగా 10వేల కోట్లు నుండి రూ.837 కోట్లకు కోత పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నాయన్నారు. గత 20 ఏళ్లులో ఉపాధిహామీ చట్టానికి ఇంత దారుణంగా నిధులు కోతకోసింది ఏనాడు లేదన్నారు. గాంధీ పేరుతో ఉన్న చట్టాన్ని పేరుమార్చి పనులు 125 రోజులకు పెంచామని గొప్పలు చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం నిధుల కేటాయింపులో తన నిజస్వరుపాన్ని బయట పెట్టిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% కి చెందిన 10వేల కోట్లు కేటాయించడంతో కుటుంబానికి సగటున 40 నుండి 50 రోజులు పని దొరికేదని తెలిపారు.

కొత్త చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్రం ప్రభుత్వం 60% ఉండటంతో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధి హామీకి నిధులు మా దగ్గర లేవని చెప్పడంతో కేంద్రం కూడా నిధులు ఇవ్వలేదని, ఇద్దరు కలసి పేదలకు డబ్బులు కేటాయించకుండా ద్రోహం చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. మరో ప్రక్క ఫేస్ యాప్ వల్ల కొన్ని చోట్ల నెట్ సౌకర్యం లేక, గంటల తరబడి హాజరు పడక పేదలు పని ప్రదేశాల నుండి వెనుతిరగాల్సి వస్తోందని, దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపాధి హామీ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలనుకుంటే ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని, కనీసవేతనం రూ.700లు చెల్లించాలని, బడ్జెట్లో తగు నిధులు కేటాయించాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని, వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పని చేసే చోట సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply