ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే క్రిమినల్ చర్యలు

  • డీఎంహెచ్‌వో హెచ్చరిక

నర్సాపురం, ఆంధ్రప్రభ: నరసాపురం పట్టణంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఎం. రవిబాబు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురం పరిధిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల్లో భాగంగా పలు ఆసుపత్రులు, ల్యాబ్‌లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, సరైన రిజిస్ట్రేషన్లు లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇటువంటి అనధికార వైద్య కేంద్రాల నిర్వాహకులపై డా. రవిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు, చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న అన్ని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌ల నిర్వాహకులు సంబంధిత శాఖను వెంటనే సంప్రదించి వారం రోజులలోపు (7 రోజులు) తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.

నిర్దేశించిన గడువు ముగిసిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అక్రమంగా కొనసాగుతున్న ఆసుపత్రులు, ల్యాబ్‌లను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే సీజ్ చేయడంతో పాటు, సంబంధిత నిర్వాహకులపై చట్టప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందించడం, అనుమతులు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

జిల్లాలో ఎక్కడైనా అనధికారికంగా ఆసుపత్రులు, క్లినిక్‌లు లేదా డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు, బాధ్యత గల పౌరులు వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని డా. ఎం. రవిబాబు విజ్ఞప్తి చేశారు.