Aila-Elections : ఐలా ర‌ణ‌భేరీ Andhra Prabha Top Story

Aila-Elections : ఐలా ర‌ణ‌భేరీ Andhra Prabha Top Story

  • తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర…
  • ఆటోనగర్‌లో ఎన్నిక‌ల స‌య్యాట‌
  • ఆగస్టు 13న పోలింగ్, ఓట్ల లెక్కింపు
  • 1,183 మంది ఓటర్లతో ప్రతిష్ఠాత్మక పోరు
  • చైర్మన్ బరిలో ముగ్గురు అభ్యర్థులు..
  • రెండు ప్రధాన ప్యానెళ్ల మధ్య హోరాహోరీ

(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ )

దాదాపు తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత విజయవాడ ఆటోనగర్‌లోని విజయవాడ నోటిఫైడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ సర్వీస్ సొసైటీ (ఐలా) ఎన్నికలకు తెరలేవడంతో పారిశ్రామిక ప్రాంతం మొత్తం ఎన్నికల వాతావరణంలో మునిగిపోయింది. పారిశ్రామికవేత్తలు, ప్లాట్ యజమానులు, కార్మిక సంఘాలు, వ్యాపార వర్గాల దృష్టి ఇప్పుడు ఐలా ఎన్నికలపైనే ఉంది.ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో అభ్యర్థుల ఎంపిక, ప్యానెళ్ల ఖరారు, ప్రచార వ్యూహాలు వేగం పుంజుకోగా, ఆటోనగర్ అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశ్రామిక సేవల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికగా ఈ పోరు ప్రాధాన్యం సంతరించుకుంది.

Aila-Elections : ఐలా ఎన్నికలు ఇలా..

ఐలా పాలకవర్గం కోసం జరిగే ఎన్నికల కోసం ఎన్నికల అధికారి ముత్యాల దొరబాబు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా, అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా, ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితా సిద్ధమైంది.

Aila-Elections : బరిలో హేమహేమీలు..

ఈ ఎన్నికల్లో చైర్మన్ పదవికి అన్నే శివనాగేశ్వరరావు, ఎండీ ఇర్ఫాన్, సయ్యద్ షా సాహెబ్ హుస్సేని పోటీ పడుతున్నారు. ఒక ప్రధాన ప్యానెల్ తరఫున వైస్ చైర్మన్‌గా సుంకర దుర్గాప్రసాద్, కోశాధికారిగా కత్తిక శివనాగేశ్వరరావు, కార్యదర్శిగా అబ్దుల్ కలాం, సంయుక్త కార్యదర్శిగా పంచుమర్తి ప్రసాదరావు బరిలో నిలవగా, వార్డు సభ్యుల స్థానాలకు కూడా పోటీ తీవ్రంగా మారింది. రెండు ప్రధాన ప్యానెళ్లు ఓటర్లను ఆకర్షించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నాయి.

Aila-Elections : తుది ఓటర్ల జాబితా సిద్ధం

ఐలా పరిధిలో మొత్తం 1,775 మంది ప్లాట్ యజమానులు ఉన్నప్పటికీ, ఆస్తి పన్ను, సభ్యత్వ రుసుము చెల్లించి అర్హత సాధించిన వారిలో డబుల్ ఎంట్రీలను తొలగించిన తర్వాత 1,183 మంది ఓటర్లుగా ఎన్నికల అధికారులు తుది జాబితాలో చేర్చారు. ఎన్నిక నిర్వహణకు అవసరమైన కనీస 60 శాతం సభ్యత్వ నమోదు పూర్తికావడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. 13 వార్డుల పరిధిలో జరిగే ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారింది. పారిశ్రామిక ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, భద్రత, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలకు అవసరమైన సేవల మెరుగుదల వంటి అంశాలు ప్రచారంలో ప్రధాన చర్చగా మారాయి. ఎన్నికల్లో విజయం సాధించే బృందంపైనే రానున్న కాలంలో ఆటోనగర్ అభివృద్ధి దిశ ఆధారపడనుండటంతో ఈ పోరుపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

Aila-Elections : ముమ్మర ప్రచారం..

ఐలా ఎన్నికల సందర్భంగా పారిశ్రామికవేత్తలు, ప్లాట్ యజమానులు, కార్మిక సంఘాలు, వ్యాపార సంస్థలు తమ మద్దతును కూడగట్టుకునేందుకు అభ్యర్థులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం పదవుల కోసం జరిగే పోటీ కాకుండా, ఆటోనగర్ భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే కీలక ఘట్టంగా మారాయి.