ఫిర్యాదుదరులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలి.
- ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్.
- డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ
తొర్రూరు టౌన్ , ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్., సోమవారం తోర్రూరు డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన కేసు డైరీలు, విచారణలో ఉన్న పెండింగ్ కేసులు, పోక్సో కేసులు, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్‌ఎస్ లో కేసుల ఆన్‌లైన్ నమోదు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
దర్యాప్తులో నాణ్యతను పెంచుతూ, పెండింగ్ కేసులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం సీఐలు, ఎస్‌ఐలతో సమావేశమై ప్రజలతో నిరంతరం మమేకమై స్థానిక సమాచారాన్ని సేకరించాలని, నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి పోలీసు అధికారి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
తదుపరి ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్. చింతలపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో మమేకమైయ్యారు. ఈ సందర్భంగా వారికీ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అవగాహన కల్పిస్తూ, గుర్తు తెలియని ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.
గ్రామంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.అదేవిధంగా రాత్రి వేళల్లో దొంగతనాల నివారణకు గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
అత్యవసర సమాచారం, అనుమానాస్పద సంఘటనలు, భద్రతా హెచ్చరికలను వెంటనే పరస్పరం పంచుకునేందుకు గ్రామ స్థాయిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని, పోలీసులు,ప్రజల సమన్వయం తోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్. పేర్కొన్నారు.
