కాంట్రాక్టు కార్మికుడి కుటుంబానికి రూ.40 లక్షల బీమా భరోసా

సింగరేణి–పీఎన్‌బీ చొరవతో కుటుంబానికి బీమా చెక్కు అందజేత

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: సింగరేణి భూపాలపల్లి ఏరియాలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.40 లక్షల ప్రమాద బీమా చెక్కును సింగరేణి యాజమాన్యం బుధవారం అందజేసింది.

భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ–2 ప్రాజెక్టులో ఎస్‌వీఈసీ సంస్థలో పనిచేస్తున్న నెల్లూరు జిల్లా వాసి సప్పిడి శ్రీహరి ఇటీవల ప్రమాదంలో మృతిచెందాడు. సింగరేణి సంస్థ కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం వివిధ బ్యాంకులతో కుదుర్చుకున్న ప్రమాద బీమా పథకంలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా మృతుడి భార్య స్రవంతి, పిల్లలు ఉషశ్రీ, మహేష్‌కు రూ.40 లక్షల బీమా చెక్కును భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, పీఎన్‌బీ భూపాలపల్లి శాఖ మేనేజర్ గుగులోత్ కళ్యాణ్ సంయుక్తంగా అందజేశారు.

ఈ సందర్భంగా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా సంక్షేమ ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతో ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఒప్పందం చేసుకున్న బ్యాంకుల్లో ఉద్యోగులకు ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదవశాత్తు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక భరోసా అందుతోందని పేర్కొన్నారు.

సింగరేణి యాజమాన్యం అందించిన బీమా సాయానికి మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేటీకే ఓసీ–2 ప్రాజెక్టు అధికారి శ్యాంసుందర్, ఎస్‌వీఈసీ ప్రాజెక్టు మేనేజర్ మహ్మద్ అలీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.