పెద్ది పోరాటంతోనే రంగయిచెరువు కుడి కాలువ పనులు ప్రారంభం..
- మూడు పంట సీజన్లుగా రైతులకు సాగునీరు అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపణ
- రైతుల ఆందోళన, పెద్ది సుదర్శన్ రెడ్డి డెడ్‌లైన్ ఫలితంగానే అధికారులు కదిలారని బీఆర్ఎస్ వెల్లడి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : రంగయిచెరువు కుడి కాలువ పనులు బీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమం ఫలితంగానే ప్రారంభమయ్యాయని, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఒత్తిడి వల్లే అధికారులు స్పందించారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి పేర్కొన్నారు.బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కాలువ నిర్మాణానికి అవసరమైన పరిపాలనా అనుమతులు 2023 అక్టోబర్‌లోనే మంజూరైనా,ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పాలకులు,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.
దీంతో దుగ్గొండి,నల్లబెల్లి మండలాల రైతులు వరుసగా మూడు పంట సీజన్ల పాటు సాగునీరు అందక తీవ్ర నష్టాలు చవిచూశారని తెలిపారు.రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ రైతులతో కలిసి ఆందోళనలు నిర్వహించిందని,రెండు నెలల క్రితం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ధర్నా,ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్,హెచ్చరికల ఫలితంగానే అధికారులు జాతీయ రహదారి కటింగ్‌కు అనుమతులు ఇచ్చి కాలువ పనులు ప్రారంభించారని పేర్కొన్నారు.బీఆర్ఎస్ ఉద్యమం లేకపోయి ఉంటే ఈ పనులు మరింత ఆలస్యమయ్యేవని, రైతుల ఒత్తిడి ముందు ప్రభుత్వం దిగివచ్చిందని విమర్శించారు.మూడు పంట సీజన్లుగా రైతులు ఎదుర్కొన్న నష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.కాలువ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు త్వరితగతిన సాగునీరు అందించాలని కోరారు.పనులు పూర్తయ్యే వరకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతుల పక్షాన అండగా ఉంటారని,ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు సంక్షేమం,రైతు హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
