తొర్రూరులో ఘనంగా శని జయంతి వేడుకలు..

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : వైశాఖ అమావాస్య సందర్భంగా శని జయంతి వేడుకలను తొర్రూరు పట్టణంలోని ఆలయాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ దేవాలయాల్లో ఉన్న నవగ్రహ మండపాల్లో కొలువైన శ్రీ శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణంలోని నవగ్రహాల మందిరంలో శనీశ్వర స్వామికి పురోహితులు శివ, క్రాంతి ఆధ్వర్యంలో గోత్రనామార్చనలు, అష్టోత్తర నామావళి పఠనం, తైలాభిషేకం నిర్వహించారు. భక్తులు నల్ల వస్త్రధారణతో నల్ల నువ్వులు, పూలు, పండ్లతో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించారు.

ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో శని మహాదశ, అంతర్దశ, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని వంటి దశలు ఉంటాయని తెలిపారు. ఈ దశల్లో ఉన్నవారు శనిదేవునికి పరిహార పూజలు, శని హోమాలు నిర్వహించుకోవడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయమన్నారు.

ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడని, మే 17న 30 సంవత్సరాల తర్వాత రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడని తెలిపారు. రేవతి నక్షత్రం శనికి జన్మనక్షత్రం కావడంతో అక్టోబర్ 9 వరకు ఈ కాలం శని దోషాలు ఉన్నవారికి పరిహారాలు చేసుకోవడానికి శుభప్రదమని పేర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.