24 గంటల్లోనే ట్రంప్ యూటర్న్..
- హోర్ముజ్‌పై 20 శాతం రుసుము రద్దు
- గల్ఫ్ దేశాలతో వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలు
- అమెరికాలో భారీ పెట్టుబడులు వస్తాయన్న ట్రంప్
- ఇరాన్ విషయంలో మాత్రం తగ్గేదిలేదు..
ఆంధ్రప్రభ : హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే సరకు నౌకలపై 20 శాతం రుసుము వసూలు చేస్తామంటూ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 24 గంటలు తిరగకముందే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రతిపాదిత రుసుమును ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. దాని స్థానంలో గల్ఫ్ దేశాలతో భారీ వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలు చేసుకోనున్నట్లు వెల్లడించారు.
మధ్యప్రాచ్య దేశాల నాయకులతో జరిగిన చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అందిస్తున్న భద్రతకు ప్రతిఫలంగా హార్ముజ్ జలసంధి గుండా తరలించే సరకు విలువలో 20 శాతం రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనకు బదులుగా.. గల్ఫ్ దేశాలు అమెరికాలో వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలు చేసుకునే విధానాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ పెట్టుబడులు భారీ స్థాయిలో ఉంటాయని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. ఏ దేశం ఎంత పెట్టుబడి పెట్టనుందనే వివరాలను వెల్లడించలేదు.
ఒక్కరోజులోనే మారిన నిర్ణయం..
హోర్ముజ్ జలసంధికి మేమే (అమెరికానే) సంరక్షకులం అంటూ సోమవారం ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య నౌకలకు కీలకమైన ఈ సముద్ర మార్గానికి అమెరికా భద్రత కల్పిస్తున్నందున.. ఆ ఖర్చును తిరిగి పొందేందుకు సరకు రవాణాపై 20 శాతం రుసుము వసూలు చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ముందే చెప్పిన సొంత నేతలు.. !!
వాస్తవానికి హార్ముజ్ వంటి అంతర్జాతీయ జలమార్గంపై రుసుము వసూలు చేయడం న్యాయపరంగా సమస్యలకు దారితీయవచ్చన్న అభిప్రాయాలు అమెరికా ప్రభుత్వ వర్గాల్లోనే గతంలో వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకల సూత్రం కీలకమని, కేవలం ప్రయాణ హక్కు కోసం రుసుములు విధించడం అంతర్జాతీయ సముద్ర నిబంధనలతో విభేదించవచ్చని న్యాయపరమైన సందేహాలు ఉన్నాయి. అంతేకాదు.. హార్ముజ్‌ను తెరిచి ఉంచాలని, అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకా రవాణా కొనసాగాలన్న వైఖరిని అమెరికా గతంలోనే వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక్కసారిగా 20 శాతం రుసుము ప్రతిపాదన తీసుకురావడం చర్చకు దారితీసింది.
మునుపెన్నడూ లేనంతగా చమురు ప్రవాహం..
హార్ముజ్ జలసంధి గుండా తరలించే సరకు విలువలో 20 శాతం రుసుము వసూలు చేయాలన్న తన నిర్ణయం మార్చుకున్న ట్రంప్.. తన పూర్తి ప్రకటనలో అమెరికా సైనిక శక్తిని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘అమెరికా సైన్యం అద్భుతమైన శక్తి కారణంగా చమురు మునుపెన్నడూ లేనంతగా ప్రవహిస్తోంది’’ అని పేర్కొన్నారు. అమెరికా రక్షణ నాయకత్వంతో పాటు సెంట్రల్ కమాండ్‌ను ప్రశంసించిన ఆయన.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా సైన్యం కారణంగా హార్ముజ్ జలసంధి… ఇప్పుడు ఇరాన్ మినహా అన్ని నౌకల రాకపోకలకు తెరిచి ఉందని చెప్పారు.
ఇక ‘మధ్యప్రాచ్య నాయకులతో జరిగిన ఫలప్రదమైన చర్చల నేపథ్యంలో 20 శాతం అమెరికా ప్రతిఫల రుసుమును గల్ఫ్ దేశాలు అమెరికాలో చేపట్టే వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలతో భర్తీ చేయాలని నిర్ణయించాను.. అని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదికలో ప్రకటించారు. ఈ పెట్టుబడులు ‘భారీగా ఉంటాయి’ అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో గల్ఫ్ దేశాల భవిష్యత్తుకు కూడా ఈ ఒప్పందాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఏ గల్ఫ్ దేశం ఎంత పెట్టుబడి పెట్టనుంది? కొత్తగా కుదిరిన ఒప్పందాల విలువ ఎంత? అనే వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. ఈ ఒప్పందాలతో అమెరికాకు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అమెరికాలోకి ఫ్యాక్టరీలు.. లక్షల ఉద్యోగాలు…
కొత్త పెట్టుబడులతో అమెరికాలో చారిత్రక స్థాయిలో కర్మాగారాలు, ఉత్పత్తి కేంద్రాలు, యంత్ర పరికరాల రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల అధిక వేతనాలతో లక్షలాది అమెరికన్ ఉద్యోగాలు సృష్టించగలమని ఆయన ప్రకటించారు. ‘‘అమెరికా మళ్లీ గెలుస్తోంది.. గతంలో ఎన్నడూ లేనంతగా గెలుస్తోంది’’ అంటూ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్.. ఆ దేశం అణ్వాయుధాన్ని పొందేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ‘‘ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు’’ అంటూ తన ప్రకటనను ముగించారు.
ఇరాన్‌పై మాత్రం వెనక్కి తగ్గని ట్రంప్
అయితే, హార్ముజ్ రుసుము ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఇరాన్ విషయంలో మాత్రం కఠిన వైఖరి కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలు లేదా ఇరాన్ సరకు రవాణాతో సంబంధం ఉన్న నౌకలపై పూర్తి దిగ్బంధం కొనసాగుతుందని ప్రకటించారు. హార్ముజ్‌లో సాధారణ నౌకా రాకపోకలకు అనుమతి కొనసాగుతుండగా, ఇరాన్‌తో సంబంధం ఉన్న నౌకలపైనే అమెరికా దిగ్బంధం కేంద్రీకృతమవుతుందని తాజా నివేదికలు పేర్కొన్నాయి.
ప్రకటనతో చమురు మార్కెట్లలో కలకలం
ట్రంప్ 20 శాతం రుసుము ప్రతిపాదన అంతర్జాతీయ చమురు మార్కెట్లను కూడా కుదిపేసింది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో హార్ముజ్ రవాణాపై అదనపు భారం పడుతుందన్న ఆందోళనతో చమురు ధరలు ఎగిశాయి. స్టాక్ మార్కెట్లపైనా ఒత్తిడి కనిపించింది. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో కొత్త రుసుము అమలైతే రవాణా వ్యయం, బీమా ఖర్చులు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న భయాలు మార్కెట్‌ను వెంటాడాయి.
అయితే మంగళవారం ట్రంప్ తన ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గడంతో చమురు ధరలు అంతకుముందు నమోదైన గరిష్ఠ స్థాయిల నుంచి కొంత తగ్గాయి. అయినప్పటికీ ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ, నౌకా రవాణాపై భద్రతా ఆందోళనల కారణంగా మార్కెట్‌లో అనిశ్చితి పూర్తిగా తొలగిపోలేదు.
20 శాతం రుసుమును వెనక్కి తీసుకున్న ట్రంప్.. ఇరాన్ విషయంలో మాత్రం తన వైఖరిని మార్చలేదు. ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలు, ఇరాన్ సరకు రవాణాతో సంబంధం ఉన్న నౌకలపై పూర్తి దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ మినహా ఇతర నౌకా రవాణాకు హార్ముజ్ జలసంధి తెరిచి ఉంటుందని ప్రకటించారు.
