బోనాల్లో ఆకతాయిలకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
- మహిళల భద్రతకు షీ టీమ్స్‌తో నిరంతర నిఘా
- గోల్కొండ నుంచి లాల్ దర్వాజ వరకు భారీ బందోబస్తు
- గత బోనాల్లో 644 మంది ఆకతాయిలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : పండుగపూట పిచ్చి వేషాలు వేస్తే తాటతీస్తాం.. మహిళలను వేధించినా, చోరీలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు.. అంటూ ఆకతాయిలకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఆషాఢ బోనాల ఉత్సవాలను శాంతియుతంగా, వైభవంగా నిర్వహించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో తొలి 15 రోజులు అత్యంత కీలకమని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆషాఢ బోనాల భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
జులై 16 నుంచి ప్రత్యేక భద్రత..
జులై 16 నుంచి ఆగస్టు 13 వరకు నగరవ్యాప్తంగా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సీపీ సూచించారు. ముఖ్యంగా గోల్కొండ జగదాంబిక మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ ఆలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ బృందాలను భారీగా మోహరించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ప్రధాన ఆలయాల వద్ద ప్రత్యేక ప్రకటన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
మహిళలను వేధిస్తే అంతే సంగతి..
బోనాలకు వచ్చే మహిళా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. షీ టీమ్స్‌తో నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. మహిళలను వేధించే ఆకతాయిలు, గొలుసు దొంగలు, మొబైల్ చోరీలకు పాల్పడేవారు, జేబుదొంగలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గత బోనాల సందర్భంగా 644 మంది ఆకతాయిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని సీపీ గుర్తుచేశారు. ఈసారి కూడా అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
పోతురాజుల విన్యాసాలు.. ఘటాల ఊరేగింపులపై ప్రత్యేక దృష్టి
బోనాల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపులకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ తెలిపారు. ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని.. పండుగ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించే వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
