భూ భారతి రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి..
భీమ్గల్ రూరల్ (ఆంధ్రప్రభ): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో భూ భారతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సర్వే బృందం బుధవారం రీ-సర్వే నిర్వహించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల హద్దులు, రికార్డుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సర్వే చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ ఎంఏ. సమీర్ తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, భూ భారతి రీ-సర్వే ద్వారా భూముల రికార్డుల్లో పారదర్శకత పెరగడంతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. భూమి యజమానులు తమ వద్ద ఉన్న పట్టాదారు పాస్బుక్లు, ఇతర భూ సంబంధిత పత్రాలతో సర్వే సమయంలో తప్పనిసరిగా హాజరై అధికారులకు సహకరించాలని సూచించారు. రీ-సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక సర్వే బృందం అధికారులు, పంచాయతీ కార్యదర్శి సంతోష్, రెవెన్యూ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, మైనార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
