శ్రీ జ్ఞాన సరస్వతి నూతన ఆలయ పునర్నిర్మాణ పనులకు శాస్త్రోక్తంగా భూమిపూజ!

వేదమంత్రాల సాక్షిగా భూపూజ

బాసర, ఆంధ్రప్రభ నిర్మల్ జిల్లా ప్రతినిధి : భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ విద్యా స్వరూపిణి, జ్ఞాన ప్రదాయిని అయిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణ పర్వంలో మరో మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల మనోభీష్టాన్ని నెరవేరుస్తూ, అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పునాది పనులకు బుధవారం ఉదయం 11:00 గంటలకు శాస్త్రోక్తంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీకారం చుట్టారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) అంజనాదేవి పర్యవేక్షణలో, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో ఈ పవిత్ర భూమిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వేద పండితులు, అర్చక స్వాములు మంగళకరమైన వేదమంత్రాలు, ఉపనిషత్ పఠనాల నడుమ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, భూమాత పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నూతన శంకుస్థాపన పనులను మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ప్రారంభించారు.

అమ్మవారి నూతన మంగళ ప్రాకారాలు, దివ్యమైన కట్టడాలతో ఈ క్షేత్రం రాబోయే రోజుల్లో మరింత శోభాయమానంగా తీర్చిదిద్దబడుతుందని ఈ సందర్భంగా అర్చక బృందం ఆశీర్వచనాలు పలికారు.

పాల్గొన్న ప్రముఖులు

ఈ పరమ పవిత్రమైన కార్యక్రమంలో సైట్ ఇంజనీర్లు రామకృష్ణ, నాగరాజు, మురళీకృష్ణలతో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు, దేవస్థాన ఉన్నతాధికారులు, సిబ్బంది మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు.

అమ్మవారి నూతన దివ్యాలయం రూపుదిద్దుకోనుండటంతో బాసర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత వెల్లివిరిసింది.