Warehouse Expansion | మరో 5 లక్షల టన్నుల స్టోరేజ్ లక్ష్యం!
రైతు పంటల నిల్వకు శాస్త్రీయ వేర్‌హౌసింగ్..
15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం దిశగా తెలంగాణ అడుగులు
20 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా జిల్లా వారీ ప్రణాళికలు..
కొత్త గోదాములకు సోలార్ సదుపాయం..
ప్రభుత్వ కార్పొరేషన్ల ఆర్థిక బలోపేతంపై మంత్రి తుమ్మల దృష్టి
Warehouse Expansion | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను మరింత విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రెండేళ్లలో ప్రస్తుత నిల్వ సామర్థ్యానికి అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో గోదాముల సదుపాయం కల్పించడంతో పాటు.. ప్రభుత్వ కార్పొరేషన్లు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన సూచించారు. వడ్డీ భారాన్ని తగ్గించుకుంటూ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
20 ఏళ్ల అవసరాలపై సమగ్ర అధ్యయనం
సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, హాకా కార్పొరేషన్‌ల మేనేజింగ్ డైరెక్టర్లతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల పనితీరు, ఆర్థిక పరిస్థితి, గోదాముల వినియోగం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు, ఆదాయ వృద్ధి అవకాశాలపై చర్చించారు. జిల్లాల వారీగా రాబోయే 20 సంవత్సరాల గిడ్డంగుల అవసరాలపై ప్రత్యేక అధ్యయనం చేపట్టాలని మంత్రి సూచించారు. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదాముల నిర్మాణం చేపట్టాలని, నిల్వ చేసిన సరుకుల నాణ్యతను కాపాడేందుకు శాస్త్రీయ విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం 6 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం
తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఆధీనంలో ప్రస్తుతం 52 సొంత గోదాములు ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. ప్రస్తుతం గోదాముల్లో 104 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదై 6.33 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉన్నాయని వెల్లడించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఈజీ, ఇన్వెస్టర్ గోదాములు, అద్దె గోదాములతో కలిపి మొత్తం 524 గోదాములు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయని తెలిపారు.
48 కొత్త గోదాములతో సామర్థ్యం పెంపు
రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా గోదాముల సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రస్తుతం 48 కొత్త గోదాముల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోందన్నారు. మొదటి దశలో నిర్మిస్తున్న 17 గోదాములను 2027 జనవరి నాటికి పూర్తి చేసి సుమారు 2.12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండో దశలో నిర్మిస్తున్న 31 గోదాములను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి మరో 3.66 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 32 గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. వీటి ద్వారా మరో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
సోలార్ గోదాములు.. అదనపు ఆదాయంపై ఫోకస్
కొత్తగా నిర్మించే ప్రతి గోదాముపై తప్పనిసరిగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గోదాముల అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకోవడంతో పాటు.. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించే విధంగా రెడ్కో సంస్థతో కలిసి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ కార్పొరేషన్లు ఆదాయ వనరులను పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ గోదాముల సమన్వయ వినియోగం
మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, హాకా, వేర్‌హౌసింగ్ వంటి ప్రభుత్వ సంస్థల ఆధీనంలోని గోదాములను సమన్వయంతో నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. దీంతో నిర్వహణ వ్యయాలు తగ్గడంతో పాటు ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అవసరం లేకుండా ప్రైవేట్ గోదాములను అద్దెకు తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ముందుగా ప్రభుత్వ సంస్థల ఆధీనంలోని ఖాళీ గోదాములను గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు.
ఆధునిక నమూనాలతో నాణ్యమైన నిర్మాణాలు
కొత్తగా నిర్మించే గోదాముల పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి తుమ్మల సూచించారు. నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక ఇంజనీరింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఆధునిక వేర్‌హౌసింగ్ నమూనాలను అధ్యయనం చేసి ఎక్కువకాలం మన్నికగా ఉండే డిజైన్లను ఎంపిక చేయాలని ఆదేశించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక వేర్‌హౌసింగ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ప్రభుత్వ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేయడం, సాంకేతిక పరిజ్ఞానంతో ఆదాయ వనరులను పెంచడం లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
