సనాతన ధర్మం.. అన్ని మతాల పట్ల గౌరవ భావన
సనాతన ధర్మం.. అన్ని మతాల పట్ల గౌరవ భావన
- రాముడు, క్రీస్తు బోధించిన జీవన విలువలు
- ధర్మం, సంస్కారం, సహనం మధ్య సంబంధం
- చట్టబద్ధ మార్గమే సమాజానికి శ్రేయస్కరం
- ధర్మాచరణే నా కర్తవ్యం
నా ధర్మం సనాతన ధర్మం. నా మతం హిందూ మతం! అయినంత మాత్రాన నా స్వధర్మం నేను మరిచి పోను! అన్ని మతాలనూ, అన్ని ధర్మాలనూ గౌరవంగా, ఆదరించటమే నా స్వీయ ధర్మం! ఇతర ధర్మాల వారితో నా స్నేహం ఎన్నడూ చెడిపోలేదు! ఎందుకంటే వారూ నేనూ కావాలని ఎప్పుడూ కనపడని లక్ష్మణ రేఖలు విషయాలల్లో దాటటానికి ప్రయత్నించలేదు!
రాముడైనా-క్రీస్తు అయినా వారు చెప్పిన జీవన విధానాల్లో నాకు తేడాలు కనపడలేదు! భక్తి అనేది నమ్మకం మీద ఆధారపడి వుంది. మ్రొక్కుకున్నంత మాత్రాన కష్టాలు తీరుతాయా? అని నా హిందూ స్నేహితులే ప్రశ్నిస్తుంటారు! నేను మాట్లాడను. వారి ప్రశ్న నాకు అనవసరం! నా నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నారని నేను భావించను! కారణం వారు ఎన్నడూ నన్ను బాధించటానికి ఆ ప్రశ్న అడిగారని నేను అనుకోలేదు. వారి అనుభవంలో వారి సందేహం తీరం పోవటం వల్ల అడిగారని మాత్రమే నేను అనుకుంటాను!
నాకు సంబంధించని, నాకు తెలియని వ్యక్తి నా జీవన విధానాన్ని కించపరచటానికి ప్రయత్నిస్తేనే నా అంతరాంతరాళాల్లో బాధ బడబాగ్నిలా రగులుతుంది! నేను అభిమానించే రాముడ్ని నానా విధాలా, అవమానపూర్వకంగా వీధిలోకి లాగుతేనే నేను వేదనను అనుభవించేది! మనుషుల్లో శ్రీరాముడు పురుషోత్తముడు! దేవుడని మనం అనుకున్నాం కానీ రాముడు తనను దేవుడిగా అనుకున్నట్లు ఎక్కడా కనపడలేదు! క్రీస్తు కూడా తాను దేవుడనని చెప్పినట్లు ఎవరూ చెప్పలేదు! క్రీస్తు కాశీలో కొన్నాళ్లు వున్నారని ఎవరో చెబుతే నేను సంతోషించాను! పరమత ధర్మాన్ని అధ్యయనం చేయటానికి కాశీ సందర్శించారా అన్న ఆలోచన మాత్రమే చేసాను! ఆయన నిజంగా వచ్చాడా లేదా అన్న మీమాంసలోకి వెళ్ళలేదు! రావణుడిని రాముడు యుద్ధం ప్రారంభించటానికి లగ్నం పెట్టమని అడిగాడని రామాయణంలో వుందంటే నేను పరవశించాను. శత్రుత్వం వేరు మిత్రత్వం వేరు అన్న వారిద్దరి గొప్ప ఆలోచన నాకు సంతోషాన్ని కలిగించింది! అది కట్టుకథా, నిజంగా జరిగిందా అని ఆలోచించలేదు. నమ్మకంలో తర్కం వుండదు! జీవన విధానం బోధించిన నా సనాతన ధర్మం అన్ని మతాలను గౌరవించమని నాలో ప్రేరేపించింది! అదేం తప్పు కాదు కదా! నీ ధర్మం నీవు కాపాడుకుంటూనే అన్ని ధర్మాలను గౌరవించమన్న భావన కలిగించటం తప్పెలా అవుతుంది?
నా తల్లి సీతమ్మను ఎవరో తెలియని వ్యక్తి నీచంగా, కుతర్కంతో, తృణప్రాయంగా తీసేసి మాట్లాడాడని చదివినప్పుడు మీడియాలో చూసినప్పుడు అతని సంస్కారహీనత మాత్రమే కనపడింది! సంస్కారం అబ్బేది జీవన విధానం నేర్పుతుంది! సనాతన ధర్మం నాకు ఉగ్గుపాలతో రంగరించి ఆ ఆలోచనా విధానాన్ని నేర్పింది! అందుకే దూషణ, భూషణలకు అతీతంగా వుండటమే నా ధర్మం నేర్పింది. అయినంత మాత్రాన సామాన్యుడనైన నాకు కోపం రాలేదని అబద్ధం చెప్పలేను! అయితే అదే వ్యక్తి సనాతన ధర్మాన్ని సాగదీసి సన్యాసి ధర్మంగా, ఛీత్కరణ ధోరణిలో హేళన చేసినప్పుడు అప్రయత్నంగా నాకు సన్యాసి ధర్మం ఏమిటో తెలిసి వచ్చింది. సన్యాసి అన్నిటికి అతీతమైన జీవన విధానాన్ని ఆచరిస్తున్నాడు. అది కూడా ధర్మాలలో ఒక ధర్మం కదా! ఆ తిట్టు ఆ విధంగా నా ధర్మాన్ని పొగిడినట్లుగా అన్పించింది! అందుకే నా కోపాగ్ని నిముషంలో చల్లారిపోయింది!
ఎవరో ఏదో అన్నారని, కావాలని మనిషి మనిషికీ మధ్య చిచ్చు రేపాలని ప్రయత్నించినప్పుడు ఆ ట్రాప్లో పడకపోవటమే మంచిదనిపించింది!
రాజ్యాంగ ధర్మాలను, చట్టాలను అతిక్రమించిన వాడిని శిక్షించే అర్హత ప్రభుత్వాలకూ-చట్టాలకూ వుండాలని నియమాలు వున్నప్పుడు నేనెందుకు వీధుల్లో యుద్ధాలు చేయాలి? ప్రభుత్వాలే చట్టాలను అతిక్రమించిన వారిని శిక్షిస్తుంది కదా!
నా కర్తవ్యం నా జీవన విధానాన్ని మనసా వాచా ఆచరించటం. ధర్మతలకు హాని కలిగించే విధానం నాకు నేర్పలేదు కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించటమే!
– రావులపాటి సీతారాంరావు
