ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. అక్రమ షెడ్‌పై అధికారుల చర్యలు
గ్రేటర్ హైదరాబాద్, ఆంధ్రప్రభ: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన షెడ్డు వ్యవహారంపై ఆంధ్రప్రభ ప్రచురించిన కథనాలకు స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ షెడ్డు తొలగింపు చేపట్టారు.

ఘట్కేసర్ సర్కిల్లోని పోచారం డివిజన్ పరిధి అన్నోజిగూడలో, చంద్రాస్ హోటల్ ఎదురుగా ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఎలాంటి అనుమతులు లేకుండా భారీ షెడ్డు నిర్మాణం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రభ వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలపై స్పందించిన జోనల్ కమిషనర్ రాధిక గుప్త వెంటనే విచారణ జరిపి, అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమ షెడ్డు తొలగింపు చేపట్టారు. ప్రజా సమస్యలపై వెలుగులోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రభ కథనాల అనంతరం అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడాన్ని స్థానికులు స్వాగతించారు. అక్రమ నిర్మాణాలపై ఇదే తరహా కఠిన చర్యలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.
