Snake Bite Revenge | పాము తల కొరికి చంపేశాడు..!

Snake Bite Revenge | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాము కనిపిస్తేనే చాలామంది భయంతో పరుగులు తీస్తారు. ఇక అది కాటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పశ్చిమ బెంగాల్‌లో ఓ యువకుడు మాత్రం తనను కాటేసిన పాముపై కోపంతో ఊహించని పని చేశాడు. పామును పట్టుకుని ఏకంగా దాని తలను కొరికి చంపేశాడు. ఆ తర్వాత అదే పామును చేతిలో పట్టుకుని చికిత్స కోసం ఆస్పత్రికి బయలుదేరాడు.

ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. ఫరూఖ్ మోమిన్ అనే యువకుడిని ఓ పాము కాటేసింది. దీంతో తీవ్ర కోపానికి గురైన ఫరూఖ్ ఆ పామును పట్టుకున్నాడు. అనంతరం దాని తలను కొరికి చంపినట్లు సమాచారం. పాము కాటుకు చికిత్స తీసుకునేందుకు ఫరూఖ్ చనిపోయిన పామును చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. తనను కాటేసిన పాము ఏదో వైద్యులకు చూపిస్తే చికిత్స సులభమవుతుందని భావించినట్లు తెలుస్తోంది.

అయితే ఫరూఖ్ చేతిలో పామును చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అతడికి లిఫ్ట్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మరో మార్గం లేక ఫరూఖ్ పామును చేతిలో పట్టుకునే సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి చేరుకున్నాడు.

అక్కడి వైద్యులు అతడికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అనంతరం మాల్దా మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఫరూఖ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే పాము కాటేసినప్పుడు దానిని పట్టుకోవడం లేదా చంపేందుకు ప్రయత్నించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధితుడిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడమే అత్యంత కీలకమని సూచిస్తున్నారు.