Ghatkesar Illegal Construction | సర్కిల్ అధికారులకు తెలియకుండానేనా?
జాతీయ రహదారి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణం
ఏడు నెలలుగా కొనసాగుతున్నా చర్యలేవీ?
గత కమిషనర్ అడ్డుకున్నారు.. ఇప్పటి అధికారుల మౌనం ఎందుకు?
ప్రశ్నిస్తున్న స్థానికులు
Ghatkesar Illegal Construction | ఆంధ్రప్రభ నిఘా విభాగం, గ్రేటర్ హైదరాబాద్, జూలై 15:
తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా, ప్రధాన జాతీయ రహదారిని ఆనుకొని గత ఏడు నెలలుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు వస్తున్నప్పటికీ సర్కిల్ అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ ఎంఎంసీ సర్కిల్లోని పోచారం డివిజన్ పరిధిలో, ఎంజీఆర్ థియేటర్ ఎదురుగా ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి పక్కనే ఓ భారీ నిర్మాణం చేపట్టారు. అనుమతులకు విరుద్ధంగా, జాతీయ రహదారి వైపు అవసరమైన సెట్‌బ్యాక్ వదలకుండా, పార్కింగ్ స్థలానికి సంబంధించిన నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
2025లో పోచారం మున్సిపల్ పాలన కొనసాగుతున్న సమయంలోనూ ఈ నిర్మాణంపై పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. వాటికి స్పందించిన అప్పటి కమిషనర్ నిర్మాణ పనులను అడ్డుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘట్కేసర్ సర్కిల్ ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు సర్కిల్ ఉన్నతాధికారులు గానీ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు గానీ ఈ నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే బహిరంగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కథనం ప్రచురితం.. హడావుడిగా ప్రారంభోత్సవ ఏర్పాట్లు?
ఈ నిర్మాణ వ్యవహారంపై ‘ఆంధ్రప్రభ’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో, సంబంధిత నిర్మాణంలో హడావుడిగా ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణంపై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు కొనసాగుతున్న సమయంలోనే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
‘‘నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నా సర్కిల్ అధికారులు ఇంకెప్పుడు స్పందిస్తారు?’’ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపైనా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా స్పందించి, జాతీయ రహదారి వైపు సెట్‌బ్యాక్, పార్కింగ్ నిబంధనలు, మంజూరైన నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు విచారణలో తేలితే, సంబంధిత చట్టాలు–నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
