ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..
చిలుపూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తున్న గొప్ప నాయకులు రాహుల్ గాంధీ అని వెల్లడించారు. దేశంలో అణగారిన వర్గాలపై, మహిళల పై, పేద ప్రజలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, బాధితులకు అండగా ఉంటూ పార్లమెంట్ లో గళం విప్పుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా స్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని అధికారం తమకే శాశ్వతం అన్నట్లుగా ప్రాంతీయ, జాతీయ పార్టీలను చీల్చుతూ ఇక మాకు ఎదురు లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
గతంలో తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎదురే లేదు అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్, కేసీఆర్ ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో రానున్న ఎన్నికలలో బీజేపీ పార్టీకి, మోడీ ప్రభుత్వానికి అదే రీతిలో ప్రజలు గుణపాఠం చెబుతారని వెల్లడించారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, రాష్ట్రంలో మరోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, ఆ దిశగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికునిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, గుడి వంశీధర్ రెడ్డి, గుర్రం ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిది బెల్దే వెంకన్న, జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
