Ice Cream Raid | కాలం చెల్లిన రంగులతో ఐస్‌క్రీమ్ తయారీ
రామంతాపూర్‌లో బట్టబయలు
ఉప్పల్ ఎస్‌వోటీ దాడుల్లో గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు..
ఫంగస్ పట్టిన అంజీర్ స్వాధీనం
శ్రీ లక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ నిర్వాహకుడు మందుల రమేష్‌పై కేసు..
ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు
Ice Cream Raid | రామంతాపూర్, ఆంధ్రప్రభ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ పేరుతో నడుస్తున్న ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఉప్పల్ ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు, ఫంగస్ పట్టిన డ్రైఫ్రూట్స్, లేబుల్ లేని ముడి పదార్థాలతో ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దాడుల్లో సుమారు 2 కిలోల ఫంగస్ పట్టిన ఎండు అంజీర్, గడువు ముగిసిన త్రిశూల్ సింథటిక్ ఫుడ్ కలర్, వీకేఎల్ ఫుడ్ ఫ్లేవర్, నాలుగు బాక్సుల ఐడాకాల్ సింథటిక్ ఫుడ్ కలర్, నాలుగు డబ్బాల గడువు ముగిసిన లూజ్ సింథటిక్ ఫుడ్ కలర్, 1.5 కిలోల లూజ్ టూటీ ఫ్రూటీని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
తయారీ కేంద్రం నిర్వాహకుడు మందుల రమేష్ను అదుపులోకి తీసుకున్న ఎస్‌వోటీ పోలీసులు, తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు, లేబుల్ లేని ముడి పదార్థాలను ఉపయోగించి ఐస్‌క్రీమ్ తయారు చేసి స్థానిక రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనతో పాటు ఇతర కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నాసిరకం లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాలపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
