AP | వచ్చే మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి…

పట్టిసీమతో రాయలసీమకు నీటిని తరలించే అవకాశం
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
రెండేళ్లలో సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లు ఖర్చు చేశాం
రైతులకు ద్రోహం చేసిన గత ప్రభుత్వం
పోలవరం పూర్తయితే గ్రావిటీ ద్వారానే నీరు
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో ఘనంగా జల హారతి


AP | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: వచ్చే మూడేళ్లలో 36 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద బుధవారం పవిత్ర జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణ డెల్టాకు తరలించడం వల్ల శ్రీశైలంలో నీటిని పొదుపు చేసుకోగలిగామని చెప్పారు. అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. 2014 – 19 మధ్యకాలంలో సాగునీటి రంగానికి రూ. 68 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. 2024 నుంచి రెండేళ్లలో రూ. 24 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గత పాలకులు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా పట్టించుకోలేదని విమర్శించారు. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా మాట్లాడలేదని, ప్రాజెక్టుల మరమ్మతులకు పైసా కూడా ఇవ్వలేదని, కనీసం గ్రీజు కూడా పూయలేదని విమర్శించారు. డయాఫ్రం వాల్ కూడా కొట్టుకుపోయేలా చేశారన్నారు.

అతి ముఖ్యమైన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం దేశద్రోహం, రాష్ట్ర ద్రోహం అవుతుందన్నారు. తాము తుంగభద్ర డ్యామ్ కు కొత్త గేట్లు ఏర్పాటు చేయించమని, ధవళేశ్వరం బ్యారేజీకి రూ.152 కోట్లతో కొత్త గేట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించినట్లు చెప్పారు. 2014 – 19 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేశామని, 2019 – 24 మధ్య కనీసం రెండు శాతం కూడా పనులు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు గత పాలకులు ద్రోహం చేశారని ఆరోపించారు. తాను 37సార్లు నేరుగా పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని 136 సార్లు సమీక్షించానని, ప్రస్తుతం ప్రాజెక్టు 89 శాతం మేర పూర్తి చేసామని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ.2250 కోట్లు చెల్లించామన్నారు.

2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, రాష్ట్రానికి జీవనాడిగా మారుస్తామని ప్రకటించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే నేరుగా గ్రావిటీ ద్వారానే నీరు వస్తుందని చెప్పారు. వంశధార నుంచి పెన్నా వరకు రాష్ట్రంలో నదులు అనుసంధానం తన ఆకాంక్ష అని చంద్రబాబు స్పష్టం చేశారు. గంగా – కావేరి నదులు కూడా అనుసంధానమైతే భారత్ కు తిరిగి ఉండదని చెప్పారు. సముద్రంలోకి వెళ్లే నీటిని సాగు, తాగు పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుందని తెలిపారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారితో దేశ ఆర్థిక పరిస్థితి మారిపోయిందని చెప్పారు.

కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రముఖ ఇంజనీర్ కె.ఎల్.రావు కుమారుడు విజయరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ తదితరులు పాల్గొన్నారు.