Tungaturthi Congress | తుంగతుర్తి పంచాయితీకి తెరదించే ప్రయత్నం!

ఈ నెల 20లోపు పీసీసీకి నివేదిక
నియోజకవర్గ కాంగ్రెస్ వివాదంపై రంగంలోకి జగ్గారెడ్డి..
నేతల అభిప్రాయాల సేకరణ..
ఎవరిపైనా చర్యలు కాదు.. సమన్వయమే లక్ష్యమని స్పష్టం
తుంగతుర్తి అంశంపై కోమటిరెడ్డి–జగ్గారెడ్డి చర్చ

Tungaturthi Congress | ఆంధ్ర్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ క్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో తుంగతుర్తి పార్టీ వ్యవహారాలు, స్థానిక నేతల మధ్య నెలకొన్న విభేదాలపై చర్చించినట్లు సమాచారం. తుంగతుర్తి అంశంపై పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డి.. నియోజకవర్గంలోని పరిస్థితులపై సేకరించిన వివరాల ఆధారంగా ఈ నెల 20లోపు పీసీసీకి నివేదిక అందజేస్తానని తెలిపారు.

తాను జోక్యం చేసుకోను: కోమటిరెడ్డి
తుంగతుర్తి వ్యవహారంలో తాను ప్రత్యక్షంగా జోక్యం చేసుకోబోనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని జగ్గారెడ్డి చూసుకుంటారని మంత్రి చెప్పినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం కోసం చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి తెలిపారు.

నేతలతో చర్చలు.. నివేదికపై దృష్టి
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో నియామకాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై జగ్గారెడ్డి ఇప్పటికే పలువురు నేతల అభిప్రాయాలు సేకరించారు. గాంధీ భవన్‌లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను నమోదు చేసినట్లు తెలిపారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. ఈ వ్యవహారంలో ఎవరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఉద్దేశం లేదని, సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.