Amara Raja | అమర రాజా గిగా కారిడార్ ప్రారంభం
తెలంగాణలో బ్యాటరీ విప్లవానికి బూస్ట్..
అమర రాజా గిగా కారిడార్‌లో కొత్త ప్లాంట్ ప్రారంభం
దివిటిపల్లిలో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
ఈవీ బ్యాటరీ తయారీ రంగానికి కొత్త ఊతం
Amara Raja | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం ప్లాంట్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియలు, సాంకేతిక కార్యకలాపాలను పరిశీలించారు. అధునాతన బ్యాటరీ తయారీ రంగంలో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని తెలిపారు.
లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి కేంద్రం
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ గిగా కారిడార్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలు, అధునాతన కెమిస్ట్రీ సెల్స్ తయారీకి సంబంధించిన కార్యకలాపాలు చేపట్టనున్నారు. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ రంగాలకు అవసరమైన బ్యాటరీ సాంకేతికత అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.
రూ.9,500 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్
అమర రాజా గిగా కారిడార్‌ను సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు.. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఇంధన నిల్వ రంగాలకు ఊతం లభించనుంది.
ఒకే రోజు మూడు కీలక కార్యక్రమాలు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు భూమిపూజ చేశారు. అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
