మోదీ రికార్డు పాలనకు బీజేపీ శ్రేణుల సంబరాలు,

మోదీ రికార్డు పాలనకు బీజేపీ శ్రేణుల సంబరాలు,

నర్సంపేట రూరల్, (ఆంధ్రప్రభ): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీn 4,399 రోజులు నిరంతరాయంగా పదవిలో కొనసాగి, దేశ చరిత్రలో ఎన్నికైన ప్రధానుల్లో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన సందర్భంగా నర్సంపేట రూరల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల పరిధిలోని మాదన్నపేట కట్టపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధాని మోదీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి మరింత సేవ చేసేలా భగవంతుని ఆశీస్సులు కలగాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బీజేపీ కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మండల నాయకుడు తనగుల అంబేద్కర్ మాట్లాడుతూ, 2014 నుంచి నేటి వరకు మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్” నినాదంతో కోట్లాది పేద కుటుంబాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. జీ-20 అధ్యక్షత, వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం, అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారని అన్నారు.

అలాగే జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని పేర్కొన్నారు. 2047 నాటికి “వికసిత భారత్” లక్ష్య సాధనకు ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రూరల్ మండల బీజేపీ తరఫున ప్రధాని మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యుడు వడపెల్లి నరసింహారావు, జిల్లా నాయకుడు గాదెగోని అనిల్, మండల ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి రాము, దొంతరబోయిన రమేష్, జరుపుల వీరన్న, అల్లం నిఖిల్, కౌడగాని శ్యామ్, ఆరేపల్లి నర్సయ్య, ఐతే కళ్యాణ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.