మంచినీటి చెరువులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి

కైకలూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ శనివారం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి కైకలూరు, కలిదిండి మండలాల్లోని ప్రధాన మంచినీటి చెరువులను పరిశీలించారు. కైకలూరు మండలంలోని ప్రధాన మంచినీటి చెరువుతో పాటు కలిదిండి మండలం వెంకటాపురం, పోతుమర్రు గ్రామాల మంచినీటి చెరువులను ఇరిగేషన్ ఎస్‌ఈ గుణకర్, ఈఈ ఆంజనేయ ప్రసాద్, డీసీలు, నీటి సంఘాల నాయకులతో కలిసి పరిశీలించి నీటి నిల్వలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని అన్నారు. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లోని మంచినీటి చెరువులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి గ్రామంలో చెరువులు నిండుగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా తాగునీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, నీటి సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.