ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్
ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఏపీఏఐఎంఎస్ 2.0 డిజిటల్ వ్యవస్థపై ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు సత్యనారాయణ డీలర్లకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఏపీఏఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ పంటలకు అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తూ, పంటల సరళి, అంచనా డిమాండ్ ఆధారంగా మండల స్థాయిలో ముందస్తుగా ఎరువుల నిల్వలు ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఉరవకొండ డివిజన్ పరిధిలోని 48 రైతు సేవా కేంద్రాలకు (ఆర్ఎస్కేలు) లాగిన్ వివరాలు అందజేసినట్లు తెలిపారు. ఖరీఫ్-2025 ఈ-క్రాప్ బుకింగ్ పరిధిలో ఉన్న రైతుల జాబితాను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
డివిజన్ పరిధిలోని 75 ఎరువుల రిటైలర్లు, పీఏసీఎస్‌లను ఏపీఏఐఎంఎస్ 2.0లో నమోదు చేసి సంబంధిత రైతు సేవా కేంద్రాలకు అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. అన్ని వర్గాల రైతులు తమకు సమీపంలోని గుర్తింపు పొందిన రిటైలర్ల ద్వారా ఎరువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన సాధారణ ఎరువుల సిఫార్సుల ఆధారంగానే ఎరువుల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీఏఐఎంఎస్ 2.0 డిజిటల్ వ్యవస్థకు వెలుపల నిబంధనలకు విరుద్ధంగా, ముఖ్యంగా యూరియా, డీఏపీ ఎరువుల విక్రయాలు జరిపితే ఎరువుల నియంత్రణ చట్టం-1985 ప్రకారం సంబంధిత డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
