ఆగస్టు 3న వినుకొండలో జిల్లా కలెక్టర్ ప్రజా వినతుల స్వీకరణ

నరసరావుపేట, ఆంధ్రప్రభ: ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3న వినుకొండలోని వై కన్వెన్షన్ హాల్‌లో ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని ఈ నెలలో వినుకొండ నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్‌లో యథావిధిగా ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు.