సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్
- పెండింగ్ కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకునేందుకు సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026 సెప్టెంబర్ 12వ తేదీ (రెండవ శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని న్యాయస్థానాల పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఇందులో సివిల్ కేసులు, రాజీకి వీలైన క్రిమినల్ కేసులు, ఎక్సైజ్‌కు సంబంధించిన రాజీ కేసులు తదితర వివిధ రకాల కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
వ్యాజ్యదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సమయం, వ్యయం ఆదా కావడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజలు ఈ జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేశారు.
