సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం.. ఒకే వేదికపైకి
- వారసత్వ పరిరక్షణలో యువతదే కీలక పాత్ర
- ఆధునిక ఆవిష్కరణలతో అనుసంధానిస్తూ ముందడుగు వేయాలి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ ఆంధ్రప్రభ : భారతీయ సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్ప సంపద పరిరక్షణతో పాటు వాటిని భావితరాలకు చేరవేయడంలో యువతదే కీలక పాత్ర అని.. ఇందుకు దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక ఆవిష్కరణలతో అనుసంధానిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఏఈ ఫౌండేషన్.. , స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ), విశ్వ బంధు ట్రస్ట్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్‌సీఏ) సంయుక్త భాగస్వామ్యంతో శనివారం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ)లో సప్త సింధు–2026: అమరావతి ఎడిషన్ ప్రారంభమైంది.
సప్త నదుల విశిష్టత స్ఫూర్తితో దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు, అధ్యాపకులు, వాస్తుశిల్పులు, కళాకారులు, పరిశోధకులు, సాంస్కృతిక రంగ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నవ ఆలోచనల మేధోమథనం, సృజనాత్మకత, వారసత్వ పరిరక్షణకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరగనుంది. యువత సృజనాత్మకతను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలు, టెంపుల్ ఆర్కిటెక్చర్ పోటీలకు ఇది వేదికగా నిలిచింది.
ఏఈ ఫౌండేషన్ డైరెక్టర్ సంగీత మిశ్రా, ఎస్‌పీఏ (విజయవాడ) డైరెక్టర్ డా. రమేష్ శ్రీకొండ, విశ్వబంధు ట్రస్ట్ ఫౌండర్ యమునా పాఠక్, ఐజీఎన్‌సీఏ రీజనల్ సెంటర్ – తిరుపతి రీజనల్ డైరెక్టర్ డా. కేటీవీ రాఘవన్ తదితరుల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమం యువత సృజనకు కొత్త ఊపు తెచ్చింది.
కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రత్యేక అతిథిగా హాజరై విద్యార్థుల ఆర్కిటెక్చర్ కళా వైభవానికి ప్రతికలుగా నిలిచిన డిజైన్లను పరిశీలించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, యువ వాస్తుశిల్పులు, అధ్యాపకులు, కళాకారులు, పరిశోధకులు పరస్పర అనుభవాలను పంచుకోవడం ద్వారా కొత్త ఆలోచనలు, సృజనాత్మక దృక్పథాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. వాస్తుశిల్పం, వారసత్వ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి వంటి అంశాల్లో యువత సృజనాత్మకత దేశ భవిష్యత్తుకు దోహదపడుతుందని చెప్పారు. సప్త సింధు–2026.. కేవలం ఒక సదస్సు మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం, విద్య, యువత సృజనాత్మకతను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఓ గొప్ప వేదిక అని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
