మళ్ళీ కృష్ణవేణి నవహారతులు…

మళ్ళీ కృష్ణవేణి నవహారతులు…
పవిత్ర సంగమంలో పునః ప్రారంభం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ఆధ్యాత్మిక వైభవం, సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ఊతమిస్తూ ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద “కృష్ణవేణి నదీ నవహారతులు” కార్యక్రమం మళ్లీ ప్రారంభంకానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని జూన్ 5 నుంచి వైభవంగా పునఃప్రారంభించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
పవిత్ర సంగమం (ఫెర్రీ ఘాట్) వద్ద నిర్వహించే ఈ నవహారతులు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే కాకుండా విజయవాడ టెంపుల్ టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గతంలో విశేష ఆదరణ పొందిన ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నవహారతులను శాస్త్రోక్తంగా, వైదిక సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, విధివిధానాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులను ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయిలో భక్తుల రాకపోకలు, భద్రత, విద్యుత్ అలంకరణలు, వేదిక, పార్కింగ్, శుభ్రత, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించారు.
అన్ని ఏర్పాట్లపై పూర్తి స్థాయి నివేదికను జూన్ 2 లోపు సమర్పించాలని సంబంధిత అధికారులకు గడువు విధించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా భక్తులను, పర్యాటకులను ఆకట్టుకునేలా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఈవో ఆదేశించారు.
పవిత్ర కృష్ణమ్మ తల్లికి అర్పించే ఈ నవహారతులు విజయవాడ ఆధ్యాత్మిక వైభవానికి కొత్త శోభను తీసుకురానుండగా, టెంపుల్ టూరిజానికి కొత్త ఊపిరి పోయనున్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
