గిరిపురం తాగునీరు సురక్షితం..

  • ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు
  • డ‌యేరియా కేసుల‌పై నిరంత‌రం అప్ర‌మ‌త్తం
  • ముందు జాగ్ర‌త్త‌గా బ‌బుల్స్‌తో నీటి స‌ర‌ఫ‌రా
  • అస‌త్య ప్ర‌చారాలు, వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని గిరిపురం ప్రాంతంలో తాగునీటి సరఫరాకు సంబంధించి వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని.. ఇక్క‌డి తాగునీరు సుర‌క్షిత‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. వైద్య ఆరోగ్యం, న‌గ‌ర‌పాల‌క సంస్థ‌.. స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి పరిస్థితిని అత్యంత ప్రాధాన్యతతో పర్యవేక్షిస్తూ విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయి తనిఖీలు, తాగునీటి నాణ్యతను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ప్ర‌త్యేక అధికారి డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గిరిపురం ప్రాంతంలో తాగునీటి సరఫరా సమయంలో ఇళ్ల వద్దనే రెసిడ్యువల్ క్లోరిన్ పరీక్షల‌ను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇప్పటివరకు 200కు పైగా నీటి నమూనాలను సేకరించి పరీక్షించామ‌ని.. అదేవిధంగా నైట్రైట్, అమ్మోనియా తదితర పారామీటర్లపై కూడా సమగ్రంగా పరిశీలనలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరింత శాస్త్రీయ నిర్ధారణ కోసం నీటి నమూనాలను గుంటూరులోని ఐపీఎం ప్రయోగశాలకు పంపించి రసాయన, బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఇప్పటివరకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో కార్పొరేషన్ సరఫరా చేస్తున్న తాగునీటిలో ఎలాంటి కలుషిత లక్షణాలు గుర్తించలేద‌ని, రెసిడ్యువల్ క్లోరిన్ స్థాయిలు కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలిందని చెప్పారు.

ప్రస్తుతం ప్రజలకు సరఫరా చేస్తున్న నీరుసురక్షితమైన తాగునీరేనని స్పష్టం చేశారు. అయితే ప్రజారోగ్య పరిరక్షణకు మరింత ప్రాధాన్య‌మిస్తూ తాగునీటిని తప్పనిసరిగా మరిగించి, చల్లార్చిన అనంతరం మాత్రమే వినియోగించాలని ప్రజలకు సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ నగరపాలక సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న మినరల్ వాటర్ బబుల్స్‌ను గిరిపురం ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని, ప్రజలు ఎలాంటి అపోహలు లేదా అవాస్తవ ప్రచారాలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్, వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ జి.ల‌క్ష్మీశ సూచించారు.