Agriculture | ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి
వరికి బదులుగా మెట్ట పంటల సాగుకు రైతులకు సూచన
పాలేరు నియోజకవర్గంలో రూ.4.61 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Agriculture | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని కోరారు.

పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.4.61 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు.

మల్లాయిగూడెంలో రూ.2.52 కోట్లతో పెరికసింగారం ఎన్‌ఎస్‌పీ కెనాల్‌ నుంచి భగవాన్ తండా మీదుగా మల్లాయిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం కోక్యా తండాలో రూ.1.69 కోట్లతో లింగారం తండా నుంచి లోక్యా తండా ఎన్‌ఎస్‌పీ కాలువ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, అగ్రహారంలో రూ.20 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపనలు చేశారు.

కూసుమంచి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 66 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అలాగే 111 మందికి రూ.35.16 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అధిక నీటి వినియోగం అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ మెట్ట పంటలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.