కూటమి అరాచకాలను తిప్పికొడదాం..

  • జగన్ 2.0 యాప్‌ను ఆవిష్కరించిన మల్లాది విష్ణు
  • విజయవాడ సెంట్రల్‌లో ఘనంగా యాప్ ఆవిష్కరణ
  • సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులను సహించేది లేదు
  • గిరిపురంలో డయేరియా విజృంభణ.. కార్పొరేషన్ పూర్తిగా విఫలం
  • ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు
  • మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత మల్లాది విష్ణు

పాయికాపురం, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, అరాచకాలను ఎండగట్టడమే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదలాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపు నిచ్చారు. శనివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో వైఎస్సార్‌సీపీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులు, వేధింపులను తిప్పికొట్టడమే ధ్యేయంగా ఈ యాప్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ స్థాయిలో ఇప్పటికే 4,200 మందికి పైగా కార్యకర్తలు ఈ యాప్‌లో నమోదు పూర్తి చేసుకున్నారని వెల్లడించారు.​చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మల్లాది విష్ణు మండిపడ్డారు. నూతన పెన్షన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే తమ అనుకూల వ్యక్తులకు ఉద్యోగాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు పుణ్యమా అని నేడు 8వ స్థానానికి పడిపోయిందని దుయ్యబట్టారు.

కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకే రాష్ట్రంలో ఇంతటి అరాచక పాలన సాగుతోందని, ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. ​నగరంలో అసలు ప్రభుత్వం, నగరపాలక సంస్థ ఉన్నాయా లేదా అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. గిరిపురంలో గత కొన్ని రోజులుగా డయేరియా తీవ్రంగా విజృంభిస్తోందని, ఇప్పటికే దాదాపు 20 కుటుంబాలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో గుంటూరు, రాజరాజేశ్వరి పేటల్లో డయేరియాతో అమాయక ప్రజలు మరణించినా ఈ ప్రభుత్వానికి కనీసం చీము కుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. గిరిపురంలో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. బాధితులకు సురక్షితమైన తాగునీరు అందించడంతో పాటు, మురుగు నిల్వ ఉన్న సైడ్ డ్రైన్లను వెంటనే బాగు చేయాలన్నారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమ బాట పడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పర్యవేక్షణకు ప్రత్యేక సెంట్రల్ ఆఫీస్..

​స్థానిక సమస్యలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను పర్యవేక్షించడానికి సెంట్రల్ ఆఫీస్ ప్రత్యేకంగా పనిచేస్తుందని, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు, విదేశాల్లో ఉన్న మన పార్టీ మద్దతుదారులు కూడా తప్పనిసరిగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ​యాప్‌లో బూత్ లెవెల్ ఏజెంట్ల పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడిన ఆయన, కార్యకర్తల అభ్యర్థన మేరకు నమోదు గడువును మరో 10 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, కొండాయిగుంట మల్లేశ్వరి, రవిచంద్ర, సుందర్ పాల్, భోగాది మురళి, అలంపురి విజయ్, త్రివేణి రెడ్డి, వరలక్ష్మి, నందెపు సురేష్, వెన్నం రత్నాకర్, పీలేట్ల వంశీ, బత్తుల సుబ్బారావు, మాజీ చైర్మన్లు, డివిజన్ అధ్యక్షులు మరియు భారీ సంఖ్యలో వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.